Pages

Friday, 15 May 2020

వలస కూలీల కన్నీటి గాధలు

Date : 16.05.2020

ఊరుకో బిడ్డా నువ్వు ఊరుకో..
మన ఊరు వెళ్ళేదాక ఊరుకో బిడ్డా..
నా చనుబాలు లేక నువ్వు గుక్కెడితే..
నా గుండెల్లో గునపాలు దిగుతున్నట్టుంది...

పొద్దు పొడవగానే కాయకష్టం చేసుకునేటోళ్లం...
పొద్దు గూకగానే గుక్కెడు గంజి తాగి బతికేటోళ్లం...
మాయదారి రోగమొచ్చే నోటిలోనా మన్ను గొట్టే...
పేదరోగాన్ని మించిన రోగం లేదు బిడ్డా...
ఆకలి చావును మించిన నరకం లేదు బిడ్డా...

వాడవాడలా గుక్కెడు నీళ్ల కోసం చూస్తున్నా బిడ్డ...
వాడలంతా సర్కార్ సారకొట్టులే ఉన్నాయి బిడ్డా...
గంజి మెతుకులకోసం గడప తొక్కితే పోలిసోళ్ళు లాఠీదెబ్బలు వడ్డించారు బిడ్డా...
ఈ బతుకు బతకలేం బిడ్డా...

తీసుకుపోతా బిడ్డా నిన్ను నేను తీసుకుపోతా బిడ్డా....
నా భుజాలు భూమికి కుంగినా నిన్ను మోస్తా బిడ్డా...
నా నెత్తుటి చెప్పుల తడారకపోయినా మైళ్ళదూరం నడుస్తా బిడ్డా..
నడి రోడ్డు మీద ప్రాణం పోసుకున్న నీ కోసం నా ప్రాణం విడిచైనా నిన్ను ఇంటికి జేరుస్తా బిడ్డా...

ఓటు లేని ఉన్నోడు విమానంలో ఇంటికి జేరాడు బిడ్డా...
ఓటు ఉన్న లేనోడు ఇంటికోసం ఇంకా నడుస్తూనే ఉన్నాడు బిడ్డా...
ఏమి బతుకులో బిడ్డా.....

వలస కూలీల బతుకులు ఈ ప్రభుత్వానికి కనపడటం లేదా...
గంటలు కొట్టుకోవడం...
పువ్వులు చల్లుకోవడం...
కోవోత్తులు వెలిగించడంలో తీరికలేక
మరిచిపోయారా....

మీ అమర శేషు

No comments:

Post a Comment